దేశద్రోహి
నా దేశం ఇప్పుడు అడుగడుగునా
స్వేచ్ఛగా తిరగనీయని సరిహద్దు రేఖల్ని గీసుకుంటుంది
స్వేచ్ఛగా
స్వచ్ఛందంగా
అమాటకొస్తే
స్వతంత్రంగా మాట్లాడటం
తిరంగా పై తిరుగుబాటు అనే కాలమిది....
కొన్ని కాలాలంతె
కన్నీళ్లపై కూడా కూృరత్వాన్నే ప్రదర్శిస్తాయి...
కొన్ని రాజ్యాలంతె
మతం పునాదుల పైన మనుషుల్ని వేరు చేస్తాయి...
కొన్ని ఆశయాలు ఆత్మబలిదానాల్ని
కొన్ని ఆలింగనాలు నమ్మకద్రోహుల్ని
కానుకలుగా స్వీకరించాక
ఆ దేశపు దేహం మీద
ఎగిరే మత చిహ్నపు
మరణశాసనానికి
చర్చించే గొంతులు
ప్రశ్నించే కలాలు
వేలాడదీయబడ్తాయి
దగాపడ్డ జాతికి దేశభక్తి
పాఠాలు నేర్పిస్తు
అచ్చేదిన్ కలలు చూపిస్తూ
చచ్చేదిన్‌ని అమలు పరుస్తుంటాయి....
భయాలు, బాధ్యతలు
ప్రశ్నలు, సమాధానాలు
అక్షరాలు, అశ్రువులు
నిరసనలు, నినాదాలు
అన్నీ నిషేధించబడతాయి.
రేపటి నాదేశపు నిరసనకారుడికి గుర్తుగా
ఉరితాడుకి ఉద్యమం వేలాడబడుతుంది
ఒకానొక సందర్భంలో నిరసన కారుడి మరణంపై పిరికితనాన్ని
పులిమేశాక
మరణ కారణాలపైన కాక
అతని కులంపైనో గుణం పైనో
పోస్టుమార్టం నిర్వహించి
చివరాఖరకు ప్రకటన వెలువరించబడుతుంది
దాని సారాంశం
నిరసనకారుడో ఓ దేశద్రోహి...
-నబి కరీం ఖాన్

Comments
Post a Comment